తిరుపతిలో డ్రగ్స్ కలకలం: టీటీడీ ఉద్యోగి అరెస్ట్
తిరుపతిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో టీటీడీ గోవిందరాజస్వామి ఆలయ జూనియర్ అసిస్టెంట్ రాహుల్ యాదవ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మార్కెట్ విలువ రూ. 3 లక్షల గల 63 గ్రాముల ‘మెథాంఫెటమైన్’ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పవిత్రమైన టీటీడీ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఈ అక్రమ రవాణాలో ఉండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు అనుమానితులకు ప్రత్యేక 'బయో చెక్' పరీక్షలు నిర్వహిస్తున్నారు.