రాజమౌళి కోసం మహేష్ బాబుతో 94 టేకులు: పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల్లో పర్‌ఫెక్షన్ కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడరనేది జగమెరిగిన సత్యం. ప్రతి షాట్‌ను అత్యంత కచ్చితత్వంతో తెరకెక్కించే ఆయన పనితీరుపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'లో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సెట్స్‌లో రాజమౌళి అంకితభావం ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, "రాజమౌళి అంత కష్టపడే దర్శకుడిని నేను ఎక్కడా చూడలేదు. ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే, ఆయన 5 గంటలకే సెట్స్‌లో ఉంటారు. అసిస్టెంట్లతో కలిసి అప్పటికే 10-12 రిహార్సల్స్ పూర్తి చేస్తారు. లంచ్ బ్రేక్ సమయంలో కూడా షాట్ కోసం సిద్ధంగా ఉండటం ఆయనకు అలవాటు" అని చెప్పుకొచ్చారు.
ఒకే సీన్ కోసం 94 టేకులు! సినిమాలోని ఒక సన్నివేశం గురించి పృథ్వీరాజ్ వివరిస్తూ.. "ఆ సీన్ కోసం నేను, మహేష్ బాబు కలిసి 94 లేదా 97 టేకులు తీసుకున్నాం. ఉదయం మొదలైన ఆ షూటింగ్ సాయంత్రం వరకు సాగినా పర్‌ఫెక్షన్ రాలేదు. ఆ రోజు ప్యాకప్ చెప్పి, మరుసటి రోజు మళ్లీ అదే సన్నివేశాన్ని షూట్ చేశాం" అని వెల్లడించారు. మహేష్ బాబు లాంటి 'సింగిల్ టేక్ ఆర్టిస్ట్' కూడా ఇన్ని టేకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గొప్ప నటుడు కూడా.. రాజమౌళిని కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా, అద్భుతమైన నటుడిగా పృథ్వీరాజ్ కొనియాడారు. రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని స్వయంగా అభినయించి చూపించడం వల్ల నటులకు పాత్రలోని ఎమోషన్స్ అర్థం చేసుకోవడం చాలా సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. మోహన్‌లాల్ తర్వాత తాను చూసిన అత్యుత్తమ నటుడు-దర్శకుడు రాజమౌళి అని, ఆయనతో పనిచేయడం తన జీవితంలో గొప్ప అనుభవమని పృథ్వీరాజ్ ముగించారు.