ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ: ప్రయాణికుల నుంచి నగదు, ఫోన్ల అపహరణ
తుని: బెంగుళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం దోపిడీ జరిగింది. తుని-అనకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో, నలుగురు దుండగులు జనరల్ బోగీలోకి ప్రవేశించి కత్తులతో ప్రయాణికులను బెదిరించారు.
ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఆరుగురు ప్రయాణికుల నుంచి సుమారు రూ.30 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లను నిందితులు దోచుకున్నారు. అనకాపల్లి స్టేషన్‌లో రైలు దిగి వారు పరారయ్యారు. బాధితులు 139 నంబర్‌కు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.