కుప్పం రైతులకు ఊరట.. 50 ఏళ్ల భూ వివాదానికి శాశ్వత పరిష్కారం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ హక్కుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కుప్పం మండలంలోని రాములగుట్టచేను, చిలకలవంక, అంబాపురం గ్రామాల పరిధిలో సాగు చేసుకుంటున్న భూములపై రైతులకు హక్కులు కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాంతంలో మొత్తం 529.34 ఎకరాల భూమిని 220 మంది రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. అయితే భూములు వారి ఆధీనంలో ఉన్నప్పటికీ, అధికారిక రికార్డుల్లో పేర్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు రుణాలు పొందడం, భూములపై హక్కులు నిరూపించుకోవడం వంటి విషయాల్లో వారికి అనేక సమస్యలు ఎదురయ్యాయి.
ఈ భూములపై గతంలో జమీందార్ల వారసులు, అటవీశాఖ మధ్య హక్కుల వివాదం కొనసాగింది. భూములు అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని ఒకవైపు వాదనలు ఉండగా, మరోవైపు జమీందార్ల వారసులు వాటిని స్థానిక రైతులకు విక్రయించడంతో వివాదం మరింత సంక్లిష్టమైంది. అప్పటి నుంచి రైతులు సాగు చేస్తూనే ఉన్నా, హక్కుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపై స్పందించి రైతులకు అనుభవ పత్రాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. అయితే తర్వాతి ప్రభుత్వ కాలంలో ఆ పత్రాలు రద్దు కావడంతో రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తదనంతరం అటవీశాఖ సెటిల్‌మెంట్ అధికారి ఈ భూములు అటవీశాఖకు చెందినవి కావని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు అవి ప్రభుత్వ భూములని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్, దశాబ్దాలుగా సాగు చేస్తున్న అర్హులైన రైతులకు ఈ భూములను కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన ప్రభుత్వం, రైతులకు డీకేటీ పట్టాలు మంజూరు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో రాములగుట్టచేను, చిలకలవంక, అంబాపురం గ్రామాల రైతులకు భూములపై అధికారిక హక్కులు లభించే మార్గం సుగమమైంది.
ప్రభుత్వ నిర్ణయంతో కుప్పం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రైతుల జీవనోపాధికి భరోసా కల్పించడంతో పాటు, భూములపై వారికి శాశ్వత హక్కులు అందించనుంది.