Article Body
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తప్పుదారి పట్టిన ఓ పదకొండో తరగతి డ్రాపౌట్ సైబర్ నేరగాళ్లకు సహకరించి పోలీసులకు చిక్కాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రోహిత్ వీరేంద్ర సింగ్ శక్య చదువు మానేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఫేక్ బ్యాంకింగ్ యాప్స్ మరియు మాల్వేర్ ఏపీకే (APK) ఫైల్స్‌ను తయారు చేయడం ప్రారంభించాడు.
జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ నకిలీ యాప్‌లను రోహిత్ నుండి కొనుగోలు చేసి ప్రజలను మోసగిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా మాల్వేర్ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని మోసపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో సోదాలు నిర్వహించి రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ ఒక్కో యాప్ రూపకల్పనకు రూ. 15,000 మరియు సర్వీసింగ్ కోసం నెలకు రూ. 15,000 వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

Comments