అరుణాచలంలో విషాదం: గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుడు మృతి
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంలో (తిరువణ్ణామలై) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన మణికుమార్ అనే భక్తుడు తన కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనార్థం అరుణాచలానికి వెళ్లారు.
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న 'మోక్ష ద్వారం' (ఇడుక్కు పిళ్లయార్ గుహ) వద్దకు చేరుకున్నారు. ఈ ఇరుకైన రాతి సందు గుండా వెళితే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు దీనిని దాటుతుంటారు. అయితే, శరీరాకృతి కాస్త లావుగా ఉండటంతో మణికుమార్ ఆ ఇరుకైన మార్గంలో ఇరుక్కుపోయారు.
బయటకు రాలేకపోవడంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే కుటుంబ సభ్యులు, తోటి భక్తులు ఎంతో శ్రమించి ఆయన్ని బయటకు తీశారు. అప్పటికే ఆయన ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకోవడంతో, హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దైవదర్శనానికి వెళ్లిన వ్యక్తి ఇలా అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.